యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ।
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ।। 60 ।।
యతతః — స్వీయ-నియంత్రణ అభ్యాసం చేసేటప్పుడు; హి — దానికి; అపి — కూడా; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; పురుషస్య — ఆత్మ యొక్క; విపశ్చితః — విచక్షణ కలవారు; ఇంద్రియాణి — ఇంద్రియములు; ప్రమాథీని — అల్లకల్లోలమైన; హరంతి — లాక్కోనిపోవును; ప్రసభం — బలవంతంగా; మనః — మనస్సుని.
BG 2.60: ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీ పుత్రుడా,ఆత్మ వివేకము కలిగి, స్వీయ-నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు.
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే ।
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ।। 67 ।।
ఇంద్రియాణాం — ఇంద్రియముల యొక్క; హి — నిజముగా; చరతాం — తిరగటం; యత్ — ఏదేని; మనః — మనస్సు; అనువిధీయతే — ఎల్లపుడూ నిమగ్నమై ఉండునో; తత్ — అది; అస్య — వాని; హరతి — హరించును; ప్రజ్ఞాం — బుద్ధిని; వాయుః — వీచేగాలి; నావం — నావ; ఇవ — ఎలాగైతే; అంభసి — నీటిలో.
BG 2.67: ఎలాగైతే బలమైన వీచేగాలి, నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించి వేస్తుంది.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।। 62 ।।
ధ్యాయతః — చింతన చేయుట; విషయాన్ — ఇంద్రియ విషయములు; పుంసః — వ్యక్తికి; సంగః — సంగము (మమకారాసక్తి); తేషు — వాటి పట్ల (ఇంద్రియ విషయములు); ఉపజాయతే — కలుగును; సంగాత్ — సంగము (మమకారాసక్తి) నుండి; సంజాయతే — ఉత్పన్నమగును; కామః — కోరికలు; కామాత్ — కోరికల నుండి; క్రోధః — కోపము; అభిజాయతే — ఉద్భవించును.
BG 2.62: ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది.
మనం ఏదేని ఒక వస్తువులో ఆనందం ఉంది అని పదే పదే అనుకుంటే, మనస్సుకి ఆ వస్తువుతో మమకార బంధం ఏర్పడుతుంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి యందు ఏదో గమనించి ఇలా అనుకుంటాడు, ‘ఆమె నాదవుతే ఏంతో బాగుంటుంది’ అని. ఈ ఆలోచనని నిరంతరం మనస్సులో తిప్పటం వలన, అతని మనస్సుకి ఆమె పట్ల అనురక్తి ఏర్పడుతుంది.  ఒక వ్యక్తికి తాగుడు మీద అనురాగం ఉంటే తాగుదామనే కోరిక పదే పదే మనస్సులో వస్తుంటుంది. ఒకడికి ధూమపానం మీద అనురాగం ఉంటే సిగరెట్టు తాగితే ఉండే ఆహ్లాదము మీదికే మనస్సులో తలపులు పదేపదే తిరుగుతుంటుంది, అవి ఒకలాంటి యావ కలిగిస్తాయి. ఈ ప్రకారంగా, మమకారం అనేది కోరికలకు దారి తీస్తుంది.
ఒకసారి కోరిక పుడితే, అది ఇంకా రెండు సమస్యలను సృష్టిస్తుంది – లోభము (అత్యాశ) మరియు క్రోధము. కోరికలు తీరటం వలన అత్యాశ కలుగుతుంది. ‘జిమి ప్రతిలాభ లోభ అధికాఈ’ (రామచరితమానస్) ‘కోరికలను తీర్చుకుంటే అది అత్యాశకు దారి తీస్తుంది.’ కాబట్టి, వాంఛలను తృప్తి పరచటం ద్వారా వాటిని పోగొట్టుకోలేము.
‘ప్రపంచంలోని సమస్త సంపదలు, విలాసాలు, మరియు భోగ వస్తువులు లభించినా సరే, వ్యక్తి తృష్ణ చల్లారదు.
మరోపక్క, కోరికలు తీర్చుకోవటంలో ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది? అది కోపాన్ని కలుగ చేస్తుంది. గుర్తుంచుకోండి, కోపం అనేది దానికదే ఉత్పన్నమవదు. అది కోరికల నెరవేర్పుకు ఆటంకం కలగటం నుండి వస్తుంది; కోరిక మమకారబంధం నుండి వస్తుంది; మమకారాసక్తి అనేది ఇంద్రియ విషయముల యందు పదేపదే చింతన చేయటం వలన కలుగుతుంది. ఈ విధంగా, ఇంద్రియ భోగ వస్తు-విషయముల మీద పదేపదే చింతన చేయటం అనే సాధారణ క్రియ, లోభము, క్రోధము అనే జంట రోగాల దిశగా పతనానికి దారి తీస్తుంది. 
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ।। 63 ।।
క్రోధాత్ — క్రోధము నుండి; భవతి — ఉత్పన్నమగును; సమ్మోహః — విచక్షణ కోల్పోవుట; సమ్మోహాత్ — విచక్షణా రాహిత్యం నుండి; స్మృతి — జ్ఞాపక శక్తి; విభ్రమః — భ్రమ; స్మృతి-భ్రంశాత్ — స్మృతి భ్రమ వలన; బుద్ధి-నాశః — బుద్ధి నశించును; బుద్ధి-నాశాత్ — బుద్ధి నష్టం వలన; ప్రణశ్యతి — వ్యక్తి పతనమగును.
BG 2.63: కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు.
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ।। 55 ।।
శ్రీ భగవాన్ ఉవాచ — పరమేశ్వరుడైన భగవంతుడు ఇలా పలికెను; ప్రజహాతి — త్యజించి (విడిచి పెట్టి); యదా — ఎప్పుడైతే; కామాన్ — స్వార్థ కోరికలు; సర్వాన్ — అన్నీ; పార్థ — అర్జునుడా, ప్రిథ తనయుడా; మనః-గతాన్ — మనస్సు యొక్క; ఆత్మని — ఆత్మ యొక్క; ఏవ — మాత్రమే; ఆత్మనా — పరిశుద్ధ మనస్సుతో; తుష్టః — సంతుష్టుడై; స్థిత-ప్రజ్ఞః — స్థితప్రజ్ఞుడు; తదా — అప్పుడు; ఉచ్యతే — అందురు.
BG 2.55: భగవానుడు పలికెను: ఓ పార్థ, మనస్సుని వేధించే అన్నీ స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు, ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు.
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ।। 56 ।।
దుఃఖేషు — దుఃఖముల నడుమ; అనుద్విగ్న-మనాః — మనస్సులో ఉద్వేగమునకు లోను కాని వాడు; సుఖేషు — సుఖములలో; విగత స్పృహః — పొంగిపోని వాడు; వీత — లేకుండా; రాగ — మమకారం; భయ — భయము; క్రోధః — కోపము; స్థిత-ధీః — జ్ఞానోదయం అయినవాడు; మునిః — ముని; ఉచ్యతే — అనబడును.
BG 2.56: దుఃఖముల నడుమ కలతచెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము, మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థిత-ప్రజ్ఞుడైన ముని అని అంటారు.
యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ ।
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 57 ।।
యః — ఎవరైతే; సర్వత్ర — అన్ని పరిస్థితులలో; అనభిస్నేహః — మమకారం/ఆసక్తి లేకుండా; తత్-తత్ — వాటి వాటి; ప్రాప్య — పొంది; శుభ — మంచి; అశుభమ్ — చెడు; న, అభినందంతి — హర్షింపడు; న, ద్వేష్టి — ద్వేషింపడు; తస్య — అతని; ప్రజ్ఞా — జ్ఞానం; ప్రతిష్ఠితా — స్థిరమైనది.
BG 2.57: ఎవరైతే అన్నీ పరిస్థితులలో మమకారం/ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని.
యదా సంహరతే చాయం కూర్మోఽఙ్గానీవ సర్వశః ।
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 58 ।।
యదా — ఎప్పుడైతే; సంహరతే — ఉపసంహరించి; చ — మరియు; అయం — ఇది; కూర్మః — తాబేలు; అంగాని — అంగములు; ఇవ — ఆ విధంగా; సర్వశః — పూర్తిగా; ఇంద్రియాణి — ఇంద్రియములు; ఇంద్రియ-అర్థేభ్యః — ఇంద్రియ వస్తు-విషయముల నుండి; తస్య — అతని; ప్రజ్ఞా — దివ్య జ్ఞానం; ప్రతిష్ఠితా — స్థిరమవును.
BG 2.58: తాబేలు దాని అంగములను తన పైచిప్ప లోనికి ఉపసంహరించుకున్నట్టుగా, ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును.
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ।
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 68 ।।
తస్మాత్ — కాబట్టి; యస్య — ఎవనిదైతే; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; నిగృహీతాని — నిగ్రహింపబడినవో; సర్వశః — సంపూర్ణముగా; ఇంద్రియాణి — ఇంద్రియములు; ఇంద్రియ-అర్థేభ్యః — ఇంద్రియ విషయముల నుండి; తస్య — వానికి; ప్రజ్ఞా — ఆధ్యాత్మిక జ్ఞానము; ప్రతిష్ఠితాః — స్థిరముగా ఉండును.
BG 2.68: కాబట్టి, ఓ అర్జునా, ఇంద్రియములను ఇంద్రియవిషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ।। 69 ।।
యా — ఏదైతే; నిశా — రాత్రి; సర్వ-భూతానాం — అన్ని ప్రాణులకు; తస్యాం — దాని యందు; జాగర్తి — మేల్కొని ఉండు; సంయమీ — ఆత్మ నియంత్రణ/సంయమం కల; యస్యాం — దేనిలో అయితే; జాగ్రతి — మేల్కొని ఉండు; భూతాని — ప్రాణులు; సా — అది ; నిశా — రాత్రి; పశ్యతః — చూచును; మునేః — ముని.
BG 2.69: అన్నీ ప్రాణులూ దేన్నయితే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్నీ ప్రాణులకూ ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు.అంటే, ఇతర ప్రాణులు దేన్నీ అయితే సుఖం అనుకుని వెంపర్లాడతారో అది దుఃఖం అని ముని దూరంగా ఉంటాడు.
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ।। 70 ।।
ఆపూర్యమాణమ్ — అన్నీ దిశలనుండీ నిండి; అచల-ప్రతిష్ఠం — కలవరపడని; సముద్రం — సముద్రము; ఆపః — నీరు; ప్రవిశంతి — వచ్చినా; యద్వత్ — ఎలాగో; తద్వత్ — అలాగే; కామాః — కోరికలు; యం — ఎవరికైతే; ప్రవిశంతి — వచ్చునో; సర్వే — అన్ని; సః — ఆ వ్యక్తి; శాంతిమ్ — శాంతి; ఆప్నోతి — పొందును; న — కాదు; కామ-కామీ — కోరికలను సంతృప్తి పరుచుకునేందుకు కృషి చేసేవాడు.
BG 2.70: ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, ఎలాగైతే సముద్రం నిశ్చలంగా/ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా, చలించని యోగి శాంతిని పొందుతాడు; కోరికలను సంతృప్తిపర్చుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు.
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ।। 71 ।।
విహాయ — త్యజించి; కామాన్ — ప్రాపంచిక కోరికలు; యః — ఎవరైతే; సర్వాన్ — అన్నీ; పుమాన్ — వ్యక్తి; చరతి — ఉండునో; నిఃస్పృహః — అత్యాశ లేకుండా; నిర్మమః — నేను, నాది అన్న భావన లేకుండా; నిరహంకారః — అహంకారము లేకుండా; సః — అతను; శాంతిం — నిజమైన శాంతి; అధిగచ్ఛతి — పొందును.
BG 2.71: ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను/నాది అన్న భావన లేకుండా, మరియు అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ।। 72 ।।
ఏషా — ఈ విధమైన; బ్రాహ్మీ స్థితిః — భగవత్ ప్రాప్తి నొందిన దశ; పార్థ — అర్జున, ప్రిథ పుత్రుడా; న — కాదు; ఏనాం — ఇది; ప్రాప్య — పొందిన తరువాత; విముహ్యతి — భ్రమకు లోనుకాడు; స్థిత్వా — స్థిరముగా ఉండి; అస్యాం — దీనిలో; అంత-కాలే — మరణ సమయంలో; అపి — కూడా; బ్రహ్మ-నిర్వాణం — మాయ నుండి విముక్తి; ఋచ్ఛతి — పొందును.
BG 2.72: ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్లీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి, జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు.



